* మానవుని దేహం ఒక రథం వంటిది. ఆత్మ ఒక సారథి ఇంద్రియాలు అశ్వాలు. ఈ ఇంద్రియాలు అనే అశ్వాలను అదుపులో పెట్టుకుంటూ, నిపుణత్వంతో రథాన్ని నడిపే వాడే ధీరుడు.

* పాపమే దుఃఖానికి బీజము.

* మానవుడు నిర్గుణత్వంతో బ్రహ్మను పొందుతాడు. పశువులు వాసనతోనూ, ఇతరులు కళ్ళతోనూ వస్తు పరిజ్ఞానాన్ని పొందుతారు.

* సర్వకాలాలలోనూ సనాతన ధర్మాలనే ఆచరించు.

* స్వార్ధమే పాపహేతువని తెలుసుకో.

* బంగారం నుండి పుట్టిన పదార్ధానికి బంగారు గుణం శాశ్వతం. బ్రహ్మ నుండి పుట్టిన జీవికి బ్రహ్మ గుణం శాశ్వతం.

* ఏకాకివై ప్రశాంతంగా బ్రహ్మ చింతన చేయి.

* సమస్తమూ ఆత్మ కంటే అభిన్నంగా చూడు.

* క్షేత్ర పవిత్రత కంటే హృదయ శుద్ధియే ముఖ్యము.

* పరబ్రహ్మకు లింగబేధము లేదు. అది శాశ్వతమైనది, ధృడమైనది. తత్వ జ్ఞానం కలిగిన మేధావులు దానిని మోక్షం అని అంటారు.

* మోక్ష సౌథాన్ని అధిరోహించుటకు సజ్జన సాంగత్యమే పరమపద సోపానము.

* దైవీ గుణాలనే అలవర్చుకో.

* ఆద్యంతములందు భగవంతుడున్నాడని గ్రహించు.

* పంచభూతాత్మకమయిన శరీరాన్ని చూసి వ్యామోహపడకు.

* అనిత్యము అగు ఈ శరీరాన్ని నమ్మవద్దు.

* ఇంట్లో త్రాచుపాము నివసిస్తే ఎంతసుఖమో, లోకం ఇచ్చే ఐశ్వర్య సుఖమూ అంతే.

* భోగ ఆసక్తి ఉన్న విరాగికి అరణ్యమే ఇల్లు అవుతుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్న విరాగికి ఇల్లే అరణ్యమవుతుంది.

* ఎల్లప్పూడూ నీ దృష్టిని ఈశ్వరుని యందే నిలుపు.

* జ్ఞానాగ్ని ప్రజ్వలించే వరకూ తపస్సుని ఆచరించు.

* సర్వేంద్రియాలనూ విషయాల నుండి మరల్చు.

* ఆత్మ సర్వ హృదయ గుహాంతర్గతుడని విశ్వసించు

* పరమ పద ప్రాప్తికి శరీరం హేతువగుటచే మిక్కిలి పవిత్రమైనది.

* కార్మికుడు తను ఉపయోగించే పరికరాల గురించి ఎలా క్షుణ్ణంగా తెలుసుకోవాలో అదే విధంగా జీవుడు కూడా తానెందుకు జీవిస్తున్నాడో తెలుసుకోవాలి.

* బుద్ది మంతుడు తనకు జరిగిన అవమానాన్ని, నష్టాన్ని, మనోవ్యధని, వంచనను, ఇంటిగుట్టును బహిరంగపర్చడు.

* అజ్ఞానాన్ని త్యజించి నిష్కళంకంగా ఉండు.

* భగవంతునితో తగవులాడయినా సరే భక్తిని పెంపొందించుకో.

* సృష్టిలోని సమస్త జీవరాశులను ఈశ్వర విలాసంగా తలచు.

* "మానవ సేవే ~ మాధవ సేవ"

* కట్టెలలో ఎలా నిప్పు రాజేసుకుంటుందో, అలాగే గుణంలో బుద్ధి సంచరిస్తుంది.

* ప్రాణులలో భగవంతుణ్ణి, భగవంతుడిలో ప్రాణులను చూసేవాడు హరి భక్తులలో శ్రేష్ఠుడు.

* అష్ట సిద్దుల యందు మోహపడకు.

* ఏకాంతంలో కూడా పాప కార్యాలను తలచకు.

* ఎట్టి దుష్కార్యాలకు వశపడకు.

* చలనం, వికారం కలిగినప్పుడు మౌనం వహించు.

* మనశాంతిని అందించే సత్కర్మలనే ఎల్లప్పూడూ ఆచరించు.

* ఆత్మ విశ్వాసమే మహాపాతకనాశనము.

* నీ దోషాలను పరులకు వెంటనే వెల్లడించటం శ్రేయోదాయకము.

* నీ దీక్షను సర్వదా సాగించు.

* ఏకాంత వాసాన్నే అభిలషించు - దైవగుణాలనే అలవరచుకో.

* సర్వస్వం గురుపాదాలకు అర్పించు.

* సర్వకష్టాలనూ సహించు ~ జిహ్వ చాపల్యాన్ని జయించు.

* పరమానందమే నీ లక్ష్యంగా ఉంచుకో.

* ధర్మాన్నే ఆచరించు ~ అసుర గుణాలను పూర్తిగా త్యజించు.

* నీవు కుడిచేతితో ఇచ్చినది ఎడమ చేతికి తెలియనంతగా దానం చేయి.

* తన పుణ్యకర్మలే తనని రక్షించునని సర్వ కాలాల యందు విశ్వసించు.

*ఎవరినయినా సరే నీ మాటలతోనూ,చేతలతోనూ నొప్పించక ధర్మ బద్దుడవై జీవించు.

* క్రోధాన్ని సహనంతో అణచవచ్చు.

* కుల, గోత్ర సంబంధాలని తలచుకుని గర్వపడకు

* జ్ఞాన సముపార్జనే మానవ జన్మ లక్ష్యం.

* ధర్మమూ, విజ్ఞానమూ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు.

* ఎంత తెలిసిన వారయినా గురువుని ఆశ్రయించితీరాలి.

* శరీరం నశించినా ఆత్మ నశించదు.

* దైవ శక్తితో మాత్రమే అనంతమయిన ప్రేమ లభ్యమవుతుంది.

* దైవంతో సంభాషిస్తున్నానని అనుకోవటమే ప్రార్ధన.

* పరమాత్మ యొక్క కరుణను, అనుగ్రహాన్ని యాచన చేయాలి.

* మనం ఇతరులని ప్రేమిస్తే ~ వారు మనలని తిరిగి ప్రేమిస్తారు.

* సజ్జన వాక్యమే భగవత్ వాక్యం.

* గురువుని తండ్రివలె గౌరవంతో చూడాలి.

* గురుభక్తితో మోక్షం లభిస్తుంది.

* ఎవడు గురువుని మనసునందు ఉంచుకుంటాడో వాడు బ్రహ్మ మయుడై ముక్తుడగుతాడు.

* తన కర్మలనన్నింటిని పరమాత్మకు సమర్పించిన భక్తుడు బంధ విముక్తుడగుతాడు.

* ప్రకృతి అనగా అద్భుత రచన.

* గురువే శివుడు, బంధువు, స్నేహితుడు, మార్గదర్శి, ఆత్మ.

* జ్ఞానం, వైరాగ్యం, కీర్తి, సంపత్తు, పరాక్రమము, ఐశ్వర్యం,షడ్గుణాలు కలిగిన సద్గురువే భగవంతుడు.

* గురువు అనుగ్రహంలోనే నిజమయిన సుఖం దొరుకుతుంది.

* నేను అద్వితీయుడను అనే గురువాక్యాన్ని నిత్యమూ అభ్యాసము చేస్తే వనాంతరాలకు వెళ్ళే అవసరం లేదు.

* ధృడాభ్యాసంతో ఒక్క క్షణంలో 'సమాధి' పొందవచ్చును. ఆ క్షణం వచ్చినప్పటి నుండి అంతకుముందు చేసిన పాపాలన్నీ ఒక్క క్షణంలో పటాపంచలయిపోతాయి.

* శృతి, స్మృతుల జ్ఞానంలో అనేక ఐహిక, ఆముష్మిక, ధర్మాధర్మాలను, నీతి నియమాలు మొదలయినవాటిని తెలుసుకునే అవకాశం పొందిన దేహికి ఈ దేహం ధర్మసాధనం కాగలదు.

* శ్రేయస్కరమైన పనిని మరవరాదు.

* ఐశ్వర్యం కొరకు ధర్మాన్ని మరువరాదు.

* స్వాధ్యాయాన్ని, ప్రవచనములను మరచిపోరాదు.

* భగవంతుని ప్రేమకు హద్దులు లేవు.

* మౌనమే మంచిది. ఒకవేళ మాట్లాడితే ఆ మాట సత్యమై ఉండటం రెండు రెట్లు మంచిది.

* మహాత్ముల హెచ్చరికలను పాటించాలి.

* బ్రహ్మజ్ఞానులను అందరికంటే శ్రేష్టులని తెలుసుకొని వారిని ఉచిత ఆసన్నాలు, ఉపచారాలతో సత్కరించాలి.

* ప్రాణాయామం చేసేటప్పుడు భగవంతుడిని స్మృతిపథంలో ఉంచుకోవాలి.

* భక్తితో భగవంతుని పూజించే మానవుడు నరకానికి వెళ్ళడు.

* మానవ జన్మమందు భగవంతుని పూజ అవశ్యం, మహాఫలప్రదం.

* జీవుడు ఎప్పుడు సకలేంద్రియాలను నిగ్రహించి నిర్మల మనస్సుతో భగవన్నామస్మరణ చేసి భగవంతుని గుణాలను కీర్తిస్తాడో అప్పుడు సంసార దుఖఃము నుండి విముక్తుడగుతాడు.

* మానవునికి కర్తవ్యాధికారం ఉందిగానీ, ఫలాన్ని ఆపేక్షించే అధికారం లేదు.

* లే, మేలుకో. తెలుసుకోవలసింది తెలుసుకో. సాధించవలసిన దానిని సాధించు. కాలాన్ని వ్యర్ధం చేయకు అంటూ నీ మనస్సును, ఆత్మను హెచ్చరించు.

* రుచికరమైన పండు ఏ ప్రదేశంలో నయినా సరే ఏ చెట్టుకి పండినా ఆ పండ్లను రుచి చూడాలి. అదే విధంగా అందరి నుండి జ్ఞానాన్ని పొందాలి.

* మానవ దేహానికి యవ్వన, వృద్ధాప్యాలు ఎలా వస్తాయో, అలాగే మరణం ఒక్కక్షణం వచ్చిపోతుంది.

* మానవ దేహంలోని ప్రతి అంగము పంచ భూతాలతో నిర్మాణమయినప్పటికీ ఆ అంగాలలో పరమాత్ముని చైతన్యం వుంది.

* భోగియై 1౦౦ లు బ్రతికేకంటే త్యాగియై ౩ వత్సరాలు జీవించటం ఉత్తమం.

* ఎక్కడకు వెళ్ళినా వినయంతో విజయం సాధించవచ్చు.

* ఆత్మ సుఖమే శాశ్వతం. విషయ సుఖం క్షణికం.

* ప్రకృతి రహస్యాలను తెలుసుకోవాలన్నా, జ్ఞానజ్యోతిని అర్ధం చేసుకోవాలన్నా ఏకాగ్ర చిత్తులై ఉండాలి.

* జ్ఞాననిధి ద్వారాలను తెరవాలంటే అందుకు అవసరమయిన తాళం చెవి చిత్తమే.

* పవిత్రమయిన మనస్సును కలవారు అద్భుతమైన దైవశక్తిని పొందుతారు.

* ధ్యానంతో ప్రతిభని సాధించవచ్చు.

* కర్మాచరణ లేనిదే బ్రహ్మజ్ఞానం కలుగదు.

* ధైర్యంగా పురోగమించే వారిని విజయలక్ష్మి వరిస్తుంది.

* స్వార్ధమే పాపహేతువని తెలుసుకో.

* సర్వకాలాలలోనూ సనాతన ధర్మాలనే ఆచరించు.

* నిన్ను నీవు తెలుసుకో ~ సమస్తమూ ఆత్మ రూపంగా చూడు.

* ఆత్మానందం చాలా శ్రేష్టమైనది. ఇదే వరము, సుఖము ~ ఇదే సిద్ధాంతం

సేకరణ ...శ్రీ గణపతి సచ్చిదానందుల వారి పుస్తకాల , దివ్య సందేశాల నుంచి